అరిషడ్వర్గాల గురించి పూర్తి వివరాలు
కామము ,క్రోధము ,లోభము మరియు ,మోహము,మదము మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. మనిషిని ఈ అరిషడ్వర్గాలు ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ఇవి ముఖ్య కారణం . ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు.
అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం.
కామము – కామము అంటే కోరిక అని అర్ధము . ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము అంటారు .
క్రోధము – క్రోధము అంటే కోపము అని అర్ధము . ఇది కోరిన కోరికలను నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.
లోభము – లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు మరియు ధర్మకార్యములు చేయకపోవడము.
మోహము – తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతిగా వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే కూడా భరించలేకపోవడము.
మదము – మదము అంటే అహంకారం అనిఅర్ధము . ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను కూడా లెక్కచేయక పోవడము.
మాత్సర్యము – తాను కలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు కూడా దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.
అరిషడ్వర్గాలను అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం కూడా అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని యొక్క సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని యొక్క జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి.
No comments